మక్కకు దక్కని మద్దతు..డిమాండ్‌‌‌‌ లేదంటూ ధర తగ్గిస్తున్న వ్యాపారులు

మక్కకు దక్కని మద్దతు..డిమాండ్‌‌‌‌ లేదంటూ ధర తగ్గిస్తున్న వ్యాపారులు
  • ప్రభుత్వ ధర రూ. 2400.. వ్యాపారులిచ్చేది ..రూ.1600 నుంచి రూ.190‌‌‌‌‌‌‌‌0..
  • పెట్టుబడులు కూడా వస్తలేవంటున్న రైతులు
  • సీజన్‌‌‌‌ ప్రారంభమైనా తెరుచుకోని మార్క్‌‌‌‌ఫెడ్‌‌‌‌ కొనుగోలు సెంటర్లు

మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌/వరంగల్‌‌‌‌, వెలుగు : మక్క రైతులకు ‘మద్దతు ధర’ దక్కడం లేదు. మొక్కజొన్న సీజన్‌‌‌‌ ప్రారంభమై పంట మార్కెట్‌‌‌‌కు వస్తున్నా మార్క్‌‌‌‌ఫెడ్‌‌‌‌ ఆఫీసర్లు ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. దీన్ని అదనుగా తీసుకున్న వ్యాపారులు.. మొక్కజొన్నకు మార్కెట్‌‌‌‌లో డిమాండ్‌‌‌‌ లేదని చెబుతూ ధరను భారీగా తగ్గిస్తున్నారు. మార్కెట్‌‌‌‌లో వ్యాపారులు ఇచ్చే ధరతో పెట్టుబడి సైతం వచ్చే పరిస్థితి లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

క్వింటాల్‌‌‌‌కు రూ. 800 తగ్గింపు

యాసంగిలో మక్కల సాధారణ సాగు విస్తీర్ణం మూడు లక్షల ఎకరాలు కాగా.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల ఎకరాలకు పైగా సాగైంది. గత సీజన్‌‌‌‌లో క్వింటాల్‌‌‌‌ మక్కలకు మద్దతు ధర రూ.2,225 నిర్ణయించిన కేంద్రం.. ఈ సీజన్‌‌‌‌లో రూ. 175 పెంచి మద్దతు ధర రూ.2,400గా ప్రకటించింది. కానీ ఈ ధరను వ్యాపారులు ఇవ్వడం లేదు. మార్కెట్‌‌‌‌కు పంట వచ్చాక వివిధ రకాల సాకులు చెబుతూ క్వింటాల్‌‌‌‌కు రూ.800 నుంచి రూ. 900 వరకు తగ్గిస్తున్నారు. రాష్ట్రంలోని పలు మార్కెట్‌‌‌‌ యార్డుల్లో గురువారం మక్కలకు రూ.1602 నుంచి రూ.1900 మధ్యే నిర్ణయించారు.. 

తెరుచుకోని మార్క్‌‌‌‌ఫెడ్‌‌‌‌ సెంటర్లు

మక్క దిగుబడులు ప్రారంభం కాగానే మార్కెఫెడ్‌‌‌‌ సెంటర్లను ఏర్పాటు చేసి మక్కలను కొంటామని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. ఈ మేరకు జిల్లాల్లో ఎంత మేర పంట సాగైంది ? దిగుబడి అంచనా ఎంత ? ఎన్ని సెంటర్లు అవసరం అవుతాయి ? అనే వివరాలను మార్క్‌‌‌‌ఫెడ్‌‌‌‌ ఆఫీసర్లు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రపోజల్స్‌‌‌‌ పంపించారు. కానీ ఇప్పటివరకు ఎక్కడా ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు కాలేదు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాకే సెంటర్లు ఓపెన్‌‌‌‌ చేస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు. 

మక్కలకు తగ్గిన డిమాండ్‌‌‌‌ 

ప్రస్తుతం మక్క సాగు పెరగడంతో డిమాండ్‌‌‌‌ తగ్గినట్లు తెలుస్తోంది. గతేడాది వరకు మక్కలను పెద్దమొత్తంలో కొనుగోలు చేసిన ఇథనాల్‌‌‌‌ ఫ్యాక్టరీలు ఈ సారి మక్కకు బదులు రైస్‌‌‌‌ను కొంటున్నారు. ఈ మేరకు ఎఫ్‌‌‌‌సీఐతో ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిసింది. మరో వైపు పౌల్ట్రీ నిర్వాహకులు సైతం మక్కలను కొనడం లేదు. అలాగే ఏపీ, కర్నాటక, పంజాబ్, వెస్ట్‌‌‌‌ బెంగాల్‌‌‌‌, ఛత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ రాష్ట్రాల్లోనూ ఈ సారి మక్క సాగు విపరీతంగా పెరిగింది. తెలంగాణ వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటుండడంతో స్థానిక మక్కకు డిమాండ్‌‌‌‌ తగ్గిపోయింది.

జిల్లాల్లో ఇదీ పరిస్థితి..

మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ జిల్లాలో 18 వేల ఎకరాల్లో మక్క సాగైంది. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు బాదేపల్లి, వనపర్తి జిల్లాలోని అమరచింత మార్కెట్లకు పంటను తీసుకెళ్తున్నారు. ఇక్కడ వ్యాపారులు క్వింటాల్‌‌‌‌కు రూ.1600 నుంచి రూ.1821 లోపే రేటు చెల్లిస్తున్నారు. నాగర్‌‌‌‌ కర్నూల్‌‌‌‌ జిల్లా కేంద్రంలో మూడు రోజుల కిందట మార్క్‌‌‌‌ఫెడ్‌‌‌‌ ఆధర్యంలో సెంటర్‌‌‌‌ను ఓపెన్‌‌‌‌ చేసినా కొనుగోళ్లు ప్రారంభించలేదు. 


ఉమ్మడి కరీంనగర్‌‌‌‌ జిల్లాలో 96 వేల ఎకరాల్లో రైతులు మక్క సాగు చేశారు. చొప్పదండి, చిగురుమామిడి మండలాలకు మాత్రమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మంజూరు కాగా, బుధవారం చిగురుమామిడిలో ప్రారంభమైంది. చొప్పదండి మార్కెట్‌‌‌‌లో 20 రోజుల నుంచి ప్రైవేట్‌‌‌‌ వ్యాపారులు మక్కలు కొంటున్నారు. క్వింటాల్‌‌‌‌కు రూ.1800 నుంచి రూ.1930 వరకు చెల్లించగా, మూడు రోజులుగా రూ.2 వేల వరకు మద్దతు ధర ఇస్తున్నారు. 


ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3.43 లక్షల ఎకరాల్లో మక్క సాగు కాగా, వరంగల్ ఏనుమాముల మార్కెట్‌‌‌‌లో మార్క్‌‌‌‌ఫెడ్‌‌‌‌ సెంటర్‌‌‌‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. మార్కెట్‌‌‌‌కు వచ్చిన పంటకు వ్యాపారులు రూ.1600 నుంచి రూ.1900 మధ్యే చెల్లిస్తున్నారు.
ఉమ్మడి మెదక్‌‌‌‌ జిల్లాలో ఇప్పటి వరకు మార్క్‌‌‌‌ఫెడ్‌‌‌‌ సెంటర్లను ఏర్పాటు చేయలేదు. దీంతో రైతులు దళారులను ఆశ్రయింస్తున్నారు. ఇక్కడ క్వింటాల్‌‌‌‌ మక్కకు రూ.1800 నుంచి రూ.1930 మధ్యే దక్కుతోంది.


నిజామాబాద్‌‌‌‌ జిల్లాలో 32 వేల ఎకరాల్లో మక్క సాగైంది. 33 కొనుగోలు కేంద్రాలు అవసరమని ప్రపోజల్స్‌‌‌‌ పంపారు. ఇప్పటి వరకు ఒక్క సెంటర్‌‌‌‌ కూడా ఓపెన్‌‌‌‌ కాలేదు. చేతికొచ్చిన పంటను రైతులు మార్కెట్లకు తీసుకొస్తుండగా ప్రైవేట్‌‌‌‌ వ్యాపారులు క్వింటాల్‌‌‌‌కు రూ. 1800 మాత్రమే చెల్లిస్తున్నారు.
నిర్మల్‌‌‌‌ జిల్లాలో 70 మార్క్‌‌‌‌ఫెడ్‌‌‌‌ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాని ఇప్పటివరకు ఉన్నతాధికారుల ఆదేశాలు రాకపోవడంతో ఒక్క సెంటర్‌‌‌‌ను కూడా ఓపెన్‌‌‌‌ చేయలేదు.

 
ఖమ్మం జిల్లాలో 1.60 లక్షల ఎకరాల్లో మక్క సాగైంది. మార్క్‌‌‌‌ఫెడ్‌‌‌‌ సెంటర్లు లేకపోవడంతో రైతులు ప్రైవేట్‌‌‌‌ వ్యాపారులను ఆశ్రయిస్తుండడంతో వారు క్వింటాల్‌‌‌‌కు రూ. 1800 మాత్రమే ఇస్తున్నారు. ఇక్కడ ఏప్రిల్‌‌‌‌ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆఫీసర్లు తెలిపారు.

ధర లేక నష్టపోతున్నాం 

నేను ఆరు ఎకరాల్లో మక్కలు వేసిన. పెట్టుబడి సుమారు రూ.లక్ష వరకు అయింది. పంట చేతికి రావడంతో షావుకారి వద్దకు తీసుకుపోతే క్వింటాల్‌‌‌‌కు రూ.1800 ఇచ్చిండు. పంట వేసినప్పుడు యూరియా దొరక్క గోస పడినం. ఇప్పుడు ధర లేక నష్టపోతున్నం. 
– యాదమ్మ, వెన్నచర్ల, నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ జిల్లా

క్వింటాల్‌‌‌‌కు రూ.700 నష్టం 

మార్క్‌‌‌‌ఫెడ్‌‌‌‌ ద్వారా క్వింటాల్‌‌‌‌కు రూ.2,400 వస్తాయని ఆశించాం. కానీ  అధికారులు సెంటర్‌‌‌‌  ఏర్పాటు చేయకపోవడంతో రూ.1700లకే అమ్ముకున్నాం. ఒక్కో క్వింటాల్‌‌‌‌కు రూ.700 వరకు నష్టపోయినం.

– మల్లయ్య, రైతు, హనుమకొండ

లెటర్‌‌‌‌ రాసినం 

మక్కల కోనుగోలు సెంటర్‌‌‌‌ ఏర్పాటులో కొంత జాప్యం జరుగుతుంది వాస్తవమే. వరంగల్ ఏనుమాముల మార్కెట్‌‌‌‌లో మక్కల కొనుగోలు సెంటర్‌‌‌‌ ఏర్పాటు చేయాలని మార్క్‌‌‌‌ఫెడ్‌‌‌‌ ఆఫీసర్లకు లెటర్‌‌‌‌ రాశాం.
– మల్లేశం, ఏనుమాముల మార్కెట్ కార్యదర్శి, వరంగల్‌‌‌‌